HanuMan Movie: కంటెంట్‌లో దమ్ముంటే చాలు.. ఎంత పోటీ ఉన్నా ,ఎన్ని అడ్డంకులు వచ్చినా విజయం వరిస్తుంది అనే మాట వినే ఉంటారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ సినిమా ద్వారా అదే నిరూపితమైంది. కథ నచ్చితే ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మరథం పడతారు. పాజిటివ్ టాక్, సంక్రాంతి సీజన్ కావడంతో రోజురోజుకీ వసూళ్లు పెంచుకుంటూ పోతోందీ హనుమాన్ చిత్రం. తాజాగా ఓ అరుదైన రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది ఈ చిత్రం
పుష్పతో సమానంగా..
హనుమాన్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ తో దుమ్ము రేపుతుంది. ప్రీమియర్ షోల నుంచే హిట్ టాక్ రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఈ చిత్రం నచ్చడంతో అటు సౌత్ మాత్రమే కాకుండా ఇటు నార్త్ లో కూడా భారీ వసూళ్లను రాబడుతోంది. సంక్రాంతి సీజన్ కాబట్టి బరిలో పెద్ద సినిమాలు పోటీ ఉన్న సంగతి తెలిసిందే. అయితే కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు ఆదరిస్తారన్న మాటను హనుమాన్ నిరూపించింది. చిన్న సినిమా, పైగా రేసులో పెద్ద హీరోల సినిమాల నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ అవేవి ఈ చిత్రం కలెక్లన్లపై ప్రభావాన్ని చూపలేకపోయాయి.
ఇదిలా ఉండగా ప్రముఖ సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ సోషల్ మీడియాలో ఈ విధంగా పోస్ట్ చేశాడు. ‘2024లో బోణీ కొట్టిన తొలి సినిమా హనుమాన్. మొదటి మూడు రోజుల ఓపెనింగ్స్ ని చూస్తే.. కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్, కాంతార హిందీ డబ్బింగ్ వర్షన్స్ కలెక్షన్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. అలాగే పుష్ప హిందీ వర్షన్‌తో సమానంగా వసూళ్లను రాబడుతోంది. ఇక కేవలం హిందీ వర్షన్లో హనుమాన్ చిత్రం తొలి రోజు రూ.2.15 కోట్లు, మౌత్ టాక్ కారణంగా రెండో రోజు రూ.4.05 కోట్లు, మూడో రోజు రూ.6.06 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక జనవరి 25వరకు పెద్ద సినిమాలు లేకపోవడంతో హనుమాన్ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలిపాడు. ఇక యూఎస్ఏ లోను ఈ మూవీ కలెక్షన్ల పరంగా రచ్చ రేపుతోంది. లాంగ్ రన్లో హనుమాన్ మూవీ దెబ్బకు ఎన్ని రికార్డ్‌లు గల్లంతు కానున్నాయో వేచి చూడాలి.
కాగా అయోధ్యలోని రామ మందిరం నిర్మాణానికి హనుమాన్ సినిమా నుంచి విక్రయించిన ప్రతి టికెట్ నుంచి 5 రూపాయలను విరాళంగా ఇవ్వాలని చిత్ర బృందం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. అయోధ్యలోని రామ మందిరం నిర్మాణానికి హనుమాన్ సినిమా మొదటి రోజు కలెక్షన్ల నుండి 14 లక్షలు విరాళంగా అందించినట్లు వెల్లడించారు.