Fastag: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) వాహనదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. రహదారి టోల్ వసూలుకు సంబంధించిన ఫాస్టాగ్ కేవైసీ అప్డేట్ గడువును మరో నెల పొడిగించింది. గతంలో కేవైసీ అప్డేట్ చేసేందుకు జనవరి 31 వరకు గడువు ఉండగా.. తాజాగా ఫిబ్రవరి 29 వరకు ఈ తేదిని పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
ఫాస్టాగ్ కేవైసీ గడువు పెంపు
ఫాస్ట్‌ట్యాగ్(Fastag) అందుబాటటులోకి వచ్చిన వాహనదారులకు టోల్ గేట్ వద్ద బారులు తీరాల్సిన అవసరం తప్పింది. కేవలం కొన్ని సెకన్లలో టోల్ ఫీజు చెల్లించి హైవేపై రయ్ రయ్ అంటూ వెళ్తున్నారు. ఈ డిజిటల్ టోల్ కలెక్షన్ సిస్టమ్ వాహనదారులకు పెద్ద ఉపశమనమనే చెప్పాలి. ప్రస్తుతం ఆ సేవలను ఉపయోగించడం కొనసాగించాలంటే ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులందరూ వారి కేవైసీ (KYC) వివరాలను తప్పక అప్డేట్ చేయాలని ప్రభుత్వ సంస్థ కోరింది.
కాగా ప్రభుత్వం విధించిన నిర్ణీత గడువులోపు వాహనదారులు ఈ కేవైసీ వివరాలను అప్డేట్ చేయకపోతే వారి ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్ పనిచేయకుండాపోవచ్చు. అంతేకాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు అనుగుణంగా వాహనదారుల KYC ప్రక్రియను పూర్తి చేయాలని కోరుతోంది. కాగా ప్రస్తుతం నడుస్తున్న ఫాస్ట్‌ట్యాగ్ సిస్టమ్ సజావుగా సాగడంతో పాటు టోల్ వసూలు ప్రక్రియను క్రమబద్ధీకరించడంలో ఇది కీలకమైన దశ. అందుకే ప్రభుత్వం దీనిపై శ్రధ్ద వహిస్తోంది.
(ఇదీ చదవండి: ఇది కదా కిక్కు.. ప్రపంచంలోనే టాప్‌లో ఇండియన్ యూట్యూబ్ ఛానెల్.. ఎవరిదో తెలుసా! )
ఎన్హెచ్ఏఐ (NHAI) ‘ఒక వాహనం, ఒకే ఫాస్ట్‌ట్యాగ్ నినాదాన్ని మొదలుపెట్టింది. ఇది పలు వాహనాలపై ఒకే ఫాస్ట్‌ట్యాగ్‌ని ఉపయోగించడం లేదా ఒక వాహనంపై వివిధ ఫాస్ట్‌ట్యాగ్‌ల వినియోగాన్ని అరికట్టేలా చర్యలు తీసుకుంటుంది. నివేదికల ప్రకారం, జనవరి 31 లోపు 1.27 కోట్ల ఖాతాలలో ఈ తరహా ఏడు లక్షల ఫాస్ట్‌ట్యాగ్ ఖాతాలు డీయాక్టివేట్ చేసినట్లు సమాచారం.
ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ(KYC)అప్డేట్ కోసం పత్రాలు
పాస్‌పోర్ట్, ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఎన్ఆర్ఇజిఎ జాబ్ కార్డ్ (రాష్ట్ర ప్రభుత్వ అధికారి సంతకం), కేవైసీ పత్రాలతో పాటు వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కాపీని సమర్పించడం ద్వారా ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీని(KYC) అప్డేట్ ఇలా చకాచకా చేసేయండి..
1- మీ FASTag KYCని ఆన్లైన్లో అప్డేట్ చేయడానికి, ఐహెచ్ఎంసీఎల్ ఫాస్ట్‌ట్యాగ్ ( IHMCL FASTag) పోర్టల్‌లోకి వెళ్లండి.
2- పోర్టల్‌కి చేరుకున్న తర్వాత, మీ మొబైల్ నంబర్ని ఉపయోగించి లాగిన్ అవ్వండి.
3- ఆపై, పోర్టల్‌లోని మై ప్రొఫైల్(My Profile)” ట్యాబ్‌పై క్లిక్ చేసి లోనికి వెళ్లండి.
4- అందులో KYC ట్యాబ్ ఆప్షన్ కనిపిస్తుంది,.. దాని కింద, మీ KYC స్టేటస్, కస్టమర్ టైప్ని చెక్ చేయండి.
5- ఒకవేళ మీరు మీ కేవైసీని పూర్తి చేయనట్లయితే.. తప్పనిసరిగా మీ ID, అడ్రెస్ డాక్యుమెంట్లతో అన్నింటిని నింపాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా మీ కేవైసీ ప్రక్రియ పూర్తి అవుతుంది.