Ipl 2024: ఐపీఎల్ 2024 సీజన్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్ కే), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్ సీబీ)మధ్య జరిగే మ్యాచ్ తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఛాంపియన్ గా నిలవడానికి పది జట్లు సర్వ శక్తులు ఒడ్డుతాయి. కానీ కొన్ని మాత్రమే టాప్ 4లో నిలిచి టైటిల్ రేసులో నిలబడతాయి.మరి లీగ్ చరిత్లరో ఇప్పటివరకు అత్యధికసార్లు ప్లేఆఫ్స్ కు చేరిన జట్లేవో ఒక లుక్ వేద్దాం.
ముంబై ఇండియన్స్..
ఐపీఎల్ లో ఎక్కువసార్లు ప్లేఆఫ్స్ చేరిన జట్టు ముంబై ఇండియన్స్. ఇప్పటివరకు 16 ఎడిషన్లలో బరిలోకి దిగిన ముంబై.. 10 సార్లు ప్లేఆఫ్స్ కు, ఆరుసార్లు ఫైనల్స్ కు దూసుకెళ్లింది. 2013, 2015, 2017, 2019, 2020లో టైటిల్ ను అందుకుంది. ఈ ఐదు టైటిళ్లు రోహిత్ శర్మ సారథ్యంలో వచ్చినవే. 2010లో మాత్రమే చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడి రన్నరప్ గా నిలిచింది. 2011 సీజన్లో మూడో స్థానం నిలవగా, 2012, 2014, 2023 సీజన్లో నాలుగో స్థానంలో నిలిచింది. ఎక్కువసార్లు ఛాంపియన్ గా నిలిచిన తొలి జట్టు ముంబై నిలిచింది.
(( దీనిపై ఓ లుక్కేయండి: IPL 2024: ‘హార్దిక్ లేకపోయినా నష్టం లేదు.. గుజరాత్ టైటాన్స్‌కు ఆ బలం ఉంది’))
చెన్నై సూపర్ కింగ్స్..
ఐపీఎల్ లో అత్యధిక సార్లు ప్లేఆఫ్స్ ఆడిన రెండో జట్టు చెన్నై సూపర్ కింగ్స్. 14 సీజన్లలో పాల్గొన్న సీఎస్ కే రికార్డు స్థాయిలో 12 సార్లు ప్లేఆఫ్స్ కు చేరుకుంది. 2020, 2022లో మాత్రమే ఆ జట్టు టాప్ 4లో నిలవలేదు.అత్యధిక సార్లు ఫైనల్స్ ఆడిన రికార్డు చెన్నై పేరిట ఉంది. ఐదుసార్లు(2010, 2011, 2018, 2021, 2023) ఛాంపియన్ గా నిలవగా.. మరో ఐదుసార్లు(2008, 2012, 2013, 2015, 2019) రన్నరప్ గా నిలిచింది. 2009లో సెమీఫైనల్ లో ఆర్ సీబీ చేతిలో ఓడిపోయింది. 2014లో రెండో క్వాలిఫయర్ లో పంజాబ్ చేతిలో ఓడి మూడో స్థానానికి పరిమితమైంది. ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో రెండు సీజన్లలో (2016, 2017) సీఎస్ కే పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
ఆర్ సీబీ.. (Ipl 2024)
ఐపీఎల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్లలో ఆర్ సీబీ ఒకటి. టీంలో టాలెంట్ కలిగిన ప్లేయర్లకు కొదవే లేదు. అయితే ఈ జట్టుకు ఇప్పటివరకు టైటిల్ కల నెరవేరలేదు. ఆర్ సీబీ ఇప్పటివరకు 16 సీజన్లలో పాల్గొని ఎనిమిదిసార్లు ప్లేఆఫ్స్ కు చేరింది. మూడుసార్లు ఫైనల్స్ కు చేరి చివరి మెట్టుపై బోల్తా పడింది. 2009లో డెక్కన్ చార్జర్స్, 2011లో సీఎస్ కే, 2016లో ఎస్ఆర్ హెచ్ చేతిలో ఓటమిపాలై రన్నరప్ తో సరిపెట్టుకుంది. 2010, 2015, 2022లో మూడో స్థానం, 2020, 2021 లో నాలుగో స్థానంలో నిలిచింది.
కోల్ కతా నైట్ రైడర్స్..
ఐపీఎల్ లో ప్రమాదకరమైన జట్లలో కోల్ కతా నైట్ రైడర్స్ ఒకటి. ఈ టీమ్ తనదైన రోజు ఎంతటి బలమైన జట్టునైనా మట్టికరిపించగలదు. ఇప్పటివరకు 16 సీజన్లు ఆడి ఏడు సార్లు ప్లేఆఫ్స్ కు చేరింది. మూడుసార్లు ఫైనల్స్ కు వెళ్లి రెండుసార్లు ఛాంపియన్ గా నిలిచింది.గంభీర్ సారథ్యంలో 2012, 2014 ఫైనల్స్ లో గెలిచి టైటిళ్లను గెలిచింది. 2021 ఫైనల్లో సీఎస్ కే చేతిలో ఓడి రన్నరప్ తో సరిపెట్టుకుంది. 2017, 2018లో మూడో స్థానం.. 2011, 2016లో నాలుగో స్థానంలో నిలిచింది.
ఎస్ఆర్ హెచ్:
సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకు 11 సీజన్లలో పాల్గొని ఆరుసార్లు ప్లేఆఫ్స్ కు చేరింది. డేవిడ్ వార్నర్ సారథ్యంలో ఆరెంజ్ ఆర్మీ 2016 ఫైనల్లో ఆర్ సీబీని ఓడించి తొలి టైటిల్ ను అందుకుంది. 2018లో కేన్ విలియమ్సన్ కెప్టెన్సీలో ఎస్ ఆర్ హెచ్ అద్భుతంగా ఆడి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఫైనల్లో మాత్రం ఎస్ ఆర్ హెచ్ కు నిరాశే ఎదురైంది. సీఎస్ కే చేతిలో ఓడి రన్నరప్ తో సరిపెట్టుకుంది. 2020లో మూడో స్థానం, 2013, 2017, 2019లో నాలుగో స్థానంలో నిలిచింది.
ఢిల్లీ క్యాపిటల్స్
ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు 16 సీజన్లలో బరిలోకి దిగి ఆరుసార్లు ప్లేఆఫ్స్ లోకి ప్రవేశించింది. ఈ జట్టు ఒకేసారి 2020లో ఫైనల్ కు చేరింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి పాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక 2009, 2012, 2019, 2021లో హైదరాబాద్ టీం మూడో స్థానం, 2008లో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ఇక రాజస్తాన్ రాయల్స్ 14 సార్లు పాల్గొని ఐదుసార్లు ప్లేఆఫ్స్ కు చేరింది. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఆడిన రెండు సీజన్లలోనూ ప్లేఆఫ్స్ కు చేరాయి. అత్యల్పంగా పంజాబ్ కింగ్స్ 16 సీజన్లలో ఆడి రెండుసార్లు మాత్రమే ప్లేఆఫ్స్ కు వచ్చింది. 2014లో కేకేఆర్ చేతిలో ఓడి రన్నరప్ గా నిలిచింది. 2008లో మూడో స్థానం దక్కించుకుంది.