RCB Team.. ఐపీఎల్ 17వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరోసారి నిరాశపరుస్తోంది. ‘ఈ సాలా కప్ నమ్ దే’ అంటూ ప్రతీసారి బరిలోకి దిగే బెంగళూరు కప్ కొడుతుందని భావించడం.. వాళ్లు ఊసురుమనిపించడం అలవాటుగా మారిపోయింది. సీజన్లో ఇప్పటికే 8 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న బెంగళూరు కేవలం ఒకే ఒక్క విజయం సాధించి ఏడు పరాజయాలతో అట్టడుగు స్థానంలో నిలిచింది. దురదృష్టానికి మారుపేరైన ఆర్సీబీ ప్రతీ సీజన్లో గొప్పగానే పోరాడుతుంది. కానీ ఈ సీజన్లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరుస్తోందని చెప్పొచ్చు. ఒకరిద్దరి రాణింపుపైనే ఎక్కువగా ఆధారపడుతుండడం జట్టు విజయాలపై ప్రభావాన్ని చూపిస్తోంది. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు తేడాతో పరాజయం చవిచూసిన ఆర్సీబీకి అంపైర్ల నిర్ణయాలు కూడా ప్రతికూలంగా మారాయి. ఈ సీజన్లో ఆర్సీబీ ప్లేఆఫ్ రేసు నుంచి దాదాపు తప్పుకున్నట్లే. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప ఆ జట్టు టాప్-4లో నిలిచే అవకాశం లేదు. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న బెంగళూరు ప్లేఆఫ్ అవకాశాలు లేనప్పటికి మిగతా జట్లపై ఆధారపడి ఆ చాన్స్ ఉంటుంది.
Read More: ముంబైని భయపెట్టాడు; పొట్టకూటి కోసం అంపైరింగ్.. ఎవరీ అశుతోష్ శర్మ?
వాస్తవానికి 16 పాయింట్లు ఉంటే ప్లేఆఫ్‌కు చేరుకోవచ్చు. బెంగళూరు తాము ఆడే చివరి ఆరు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించడంతో వారి ఖాతాలో 14 పాయింట్లు వచ్చి చేరుతాయి. ఈ విషయంలో నెట్ రన్‌రేట్ కీలకం కానుంది. ప్రస్తుతం బెంగళూరు రన్‌రేట్ (-1.046) ఉండడం ఆ జట్టుకు ప్రతికూలాంశం. బెంగళూరు తాము ఆడే ప్రతీ మ్యాచ్‌లో భారీ తేడాతో ప్రత్యర్థులను చిత్తు చేయాల్సి ఉంటుంది. ఇది అసాధ్యమని చెప్పొచ్చు. ఎందుకంటే బెంగళూరు రాను రాను మరింత బలహీనంగా తయారైంది. ఇతర జట్లు బెంగళూరు కంటే చాలా మెరుగ్గా ఉన్నాయి. ఇది కొంచెం కష్టమే అని చెప్పొచ్చు.
అన్ని మ్యాచ్‌లు గెలిచినా కష్టమే..
ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్ డేంజరస్ సన్‌రైజర్స్‌తో ఆడాల్సి ఉంది. ఇప్పటికే లీగ్‌లో మూడుసార్లు 250 ప్లస్ స్కోర్లు బాదిన ఎస్ఆర్హెచ్ దూకుడు ముందు ఆర్సీబీ నిలవగలదా అన్నది సందేహంగా మారింది. అయితే ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లోనే 287 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 262 పరుగుల దాకా వచ్చి ఆఖర్లో పరాజయం పాలైంది. ఆ తర్వాత గుజరాత్, పంజాబ్, ఢిల్లీ, చెన్నైలతో తలపడనుంది. గత సీజన్లలో ఆర్సీబీ ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికి ఈ సీజన్లో మాత్రం ఆ కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. ముఖ్యంగా బౌలింగ్ విభాగం పూర్తిగా బలహీనంగా ఉంది. బ్యాటింగ్ విభాగంలో స్టార్లతో పూర్తిగా నిండిపోయినప్పటికి.. బ్యాటింగ్ ఒక్కటే కాదు బౌలింగ్ కూడా బలంగా ఉండాలన్న విషయం ఆర్సీబీ మరిచిపోయినట్లుంది. జట్టులో ఉన్న బౌలర్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేక దారాళంగా పరుగులు సమర్పించుకుంటూ సాధారణ స్థాయి బౌలర్లలా కనిపిస్తున్పారు. టాప్ క్లాస్ బౌలర్ అనుకున్న సిరాజ్ పూర్తిగా విఫలమవ్వడం జట్టును పూర్తిగా కలవరపెడుతోంది.ప్లేఆఫ్ చాన్స్‌లు లేనప్పటికి కనీసం అదృష్టంతోనైనా ఆర్సీబీ టాప్ 4కు వస్తుందేమో చూడాలి.
Read More: Sunrisers Hyderabad: ఏంది ఈ అరాచకం.. ఆడుతుంది సన్రైజర్సేనా?