Tollywood Movies.. ఒకప్పుడు హీరోలు స్టైల్‌గా మాట్లడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. గ్రామీణ భాష అంటే నామోషీగా ఫీలయ్యేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఇదే గ్రామీణ భాషను వద్దనుకున్న హీరోలు ఇప్పుడు అదే వాయిస్‌ను ఎత్తుకొని అభిమానులను అలరిస్తున్నారు. మన సినిమాల కథలు కూడా పల్లెబాట పడుతున్నాయి. దర్శకులు సైతం గ్రామీణ ప్రాంతాల గతాల్లోకి వెళ్ళి కథలను వెలికి తీస్తున్నారు. మరోవైపు యువ కథానాయకులు చూస్తే, గ్రామీణ ప్రాంతాల్లో పుట్టలేదు. పెరిగింది.. తిరిగింది.. చాలా వరకు నగరాల్లోనే. చదువులు ఆంగ్ల మాధ్యమంలో సాగడంతో తెలుగు సాహిత్యం గురించి తెలిసే అవకాశాలూ లేవు. దాదాపు మన యువ హీరోలందరి పరిస్థితి ఇదే. అయితే వారికి సినిమా అంటే ఎనలేని అభిమానం. ఆ అభిమానంతోనే ఆయా చిత్రాల కోసం తమకి అంతగా పరిచయం లేని పల్లెటూర్లకు పయనమై అక్కడి భాషని, యాసని పట్టేస్తున్నారు మన టాలీవుడ్ యంగ్ హీరోలు.
గోదారి యాసలో మాస్ కా దాస్
మాస్ కా దాస్‌గా పేరొందిన విశ్వక్సేన్ పక్కా హైదరాబాదీ అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ టీజర్ లో ‘అమ్మోరు పూనేసిందిరా..’ అంటూ సాగే సంభాషణ విన్న వాళ్ళు ఎవరైనా విశ్వక్ నిజంగా హైదరాబాద్ వాడేనా అని ఒక్క క్షణం అనుమానపడతారు. అంతలా గోదారి యాసని పట్టేశాడు విశ్వక్. నిజానికి గోదావరి ప్రాంతానికి చెందిన ఈ చిత్ర దర్శకుడైన కృష్ణ చైతన్య కేవలం యాస కారణంగా విశ్వక్ ఈ పాత్ర చేయగలడా అని కాస్త సందేహించారట. అయితే దానిని పటాపంచలు చేస్తూ నెల రోజులు తిరక్కుండానే ఆయన రాసిన డైలాగులను గోదారి యాసలో పలికి దర్శకుడిని ఆశ్చర్యపరిచాడు ఈ హైదరాబాదీ హీరో. ఈ రోజు విడుదలవుతున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా చూశాక బహుశా ప్రేక్షకులు పరిస్థితి కూడా ఇదే కావచ్చు.
Read More: వాళ్ల కోసమే పెళ్లి చేసుకోలేదు.. కల్కి మూవీ ప్రమోషన్స్‌లో ప్రభాస్
సుబ్రహ్మణ్యం కేరాఫ్ కుప్పం
కొత్తదనంతో ప్రేక్షకుల ముందుకు రావాలని తపించే మరో యంగ్ హీరో సుధీర్ బాబు. ఆ తపనతోనే ఈసారి కాలంలో కాస్త వెనక్కి వెళ్ళారాయన. సుధీర్ బాబు కథానాయకు డిగా జ్ఞానశేఖర్ ద్వారక దర్శకత్వం వహించిన చిత్రం ‘హరోం హర’. ఈ సినిమా చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతంలో సాగనుండగా, ఇందులో పూర్తిగా చిత్తూరు యాసలోనే తన మాటల్ని వినిపించనున్నారు సుధీర్. యాక్షన్‌కి పెద్దపీట వేసిన ఈ సినిమాలో తుపాకీ మొదలుకొని ల్యాండ్‌మైన్స్ వంటి ఆయుధాలు తయారు చేసే సుబ్రహ్మణ్యం పాత్రలో ఆయన కనపడనున్నారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. సుబ్రహ్మణ్యం అలియాస్ సుధీర్ తయారుచేసిన తుపాకీ నుంచి వచ్చిన తూటా, చిత్తూరు యాసలో ఆయన పలికిన మాట ఎలా పేలాయన్నది జూన్ 14న తెలియనుంది.
సిక్కోలు మత్స్యకారుడిగా నాగచైతన్య
గతంలో వ్యంగ్యానికే పరిమితమైన సిక్కోలు యాసలో ఇప్పుడు పలు భారీ చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. వాటిలో అక్కినేని నాగచైతన్య నటిస్తున్న ‘తండేల్ ’ ఒకటి. శ్రీకాకుళంలో జరిగిన వాస్తవిక ఘటనల ఆధారంగా చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మత్స్యకారుడి పాత్ర కోసం సిక్కోలు పదాలను పలకనున్నారు నాగచైతన్య. శ్రీకాకు ళంలోని ఘటన జరిగిన ప్రదే శాన్ని సందర్శించి, అక్కడి వారితో మాట్లాడి పలు వివరాలు తెలుసుకున్న ఆయన, ఈ పాత్ర కోసం 9 నెలల పాటు శ్రమించారు. నాగ చైతన్య కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈసినిమాలో సముద్ర నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులని మెప్పిస్తాయని చెబుతున్నారు చిత్ర రూపకర్తలు. కాగా శేఖర్ కమ్ముల రూపొందించిన ‘లవ్ స్టోరీ’ చిత్రంలోనూ తెలంగాణ మాండలికంలో డైలాగులు చెప్పి ప్రేక్షకుల మనసులు దోచారు నాగచైతన్య.
Read More: ‘డర్టీ ఫెలో’ ట్రైలర్ రిలీజ్ చేసిన ‘విశ్వంభర’ డైరెక్టర్
మునుపటి తరం వారిని మినహాయిస్తే వీరికి కాస్త సీనియర్ హీరోలు కూడా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల యాసలతో ప్రేక్షకుల మెప్పు పొందుతున్నారు. ఆ కోవలో ఇప్పటికే ‘రంగస్థలం’ చిత్రంలో గోదారి కబుర్లని వినిపించిన రామ్ చరణ్, శ్రీకాకుళం నేపథ్యంలో బుచ్చిబాబు చేయనున్న సినిమాతో సిక్కో లు వాసులకు మరింత చేరువ కానున్నారు. అల్లు అర్జున్ అనగానే స్టుల్‌తో పాటు పర్ఫెక్షన్ కూడా గుర్తొస్తొంది. దానికి ‘పుష్ప’ సినిమా ప్రత్యక్ష సాక్ష్యం. పాత్రకి కావాల్సిన ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్‌తో పాటు చిత్తూరు యాసలో సంభాషణలు పలకడంపై ఆయన తీసుకున్న శ్రద్ధ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయన్నది నిస్సందేహం. తెలంగాణ, ఆంధ్ర, సీమ మాండలికం అంటూ ఏదో ఒక భాషలో అదరగొడుతున్న మన హీరోలు సులువుగా వంద క్లబ్ కోట్ల మార్క్‌ను చేరుకుంటున్నారు. ఇది ఆసక్తికర పరిణామమే.!