USA Cricket Team.. ఒకరు పుట్టి పెరిగింది గుజరాత్ గల్లీల్లో.. మరొకరి చిన్నతనమంతా గడిచింది ముంబై వీధుల్లో! ఒకరు పాకిస్థాన్ పేసర్లను స్పూర్తిగా తీసుకొని బౌలింగ్ వైపు అడుగులు వేస్తే.. ఇంకొకరు న్యూజిలాండ్ జాతీయ జట్టులో పోటీ తట్టుకోలేక అమెరికా చేరిపోయారు! ఇలా భిన్నమైన నేపథ్యాలు.. విభిన్నమైన అభిరుచులు కలిగిన వాళ్లంతా కలిసి పొట్టి ప్రపంచకప్‌లో పెను సంచలనం సృష్టించారు.
ఆతిథ్య హోదాలో వరల్డ్ కప్ ఆడే అవకాశం దక్కించుకున్న అమెరికా మహా అయితే ఒక మ్యాచ్ నెగ్గుతుందేమో అనుకుంటే .. మెగాటోర్నీ హాట్ఫేవరెట్లలో ఒకటైన పాకిస్థాన్‌కే యూఎస్ఏ షాకిచ్చింది. నిప్పులు చెరిగే బంతులతో పాక్‌ను ఓ మాదిరి స్కోరుకే కట్టడి చేసిన అమెరికా.. ఆనక బ్యాటింగ్‌లో రెచ్చిపోయింది. పాక్ పేస్ చతుష్టయం రెచ్చిపోతున్నా ఏమాత్రం తడబడకుండా స్కోరు సమం చేసి మ్యాచ్‌ను సూపర్ ఓవర్ వరకు తీసుకెళ్లింది. ఉత్కంఠ ఊపేసిన థ్రిల్లింగ్ సూపర్ ఓవర్లో క్రమశిక్షణను నమ్ముకున్న అమెరికా విజయం సాధిస్తే.. చిన్న జట్లే కదా అని లైట్ తీసుకున్న పాకిస్థాన్‌కు గర్వభంగం ఎదురైంది.! రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని సంచలనాలు చూడాలో..
ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఊహించడం కష్టమైన పొట్టి ఫార్మాట్లో అమెరికా జట్టు అద్వితీయ ప్రదర్శన కనబరుస్తూ.. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో అత్యంత నిలకడైన జట్లలో ఒకటైన పాకిస్థాన్‌ను మట్టికరిపించింది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో అమెరికా సూపర్ ఓవర్లో పాకిస్థాన్‌ను మట్టికరిపించింది. వరల్డ్‌కప్ ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్‌పై సిరీస్ గెలిచి సత్తాచాటిన అమెరికా.. మెగాటోర్నీలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించింది. మరొక్క విజయం సాధిస్తే చాలు.. సూపర్ ప్రధాన పోటీదారుల్లో యూఎస్ఏ ముందు వరుసలో నిలవనుంది.
T20 World Cup 2024: ఐర్లాండ్‌పై విజయం.. టీమిండియా వేట షురూ
ఇప్పటికే కెనడా, పాకిస్థాన్‌లపై విజయాలు సాధించిన అమెరికా ప్రస్తుతం గ్రూప్‌లో టాప్‌ప్లేస్‌లో కొనసాగుతోంది. బంగ్లాదేశ్‌పై సిరీస్ విజయం గాలివాటం కాదని పాక్‌ను చిత్తుచేసి ప్రపంచానికి చాటిన అమెరికాతో ఇక ప్రత్యర్థులు జాగ్రత్తగా ఉండాల్సిందే. అయితే ఇది ఒక్కరోజులో సాధ్యమైంది మాత్రం కాదు. దీని వెనక ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ, అకుంఠిత దీక్ష ఉన్నాయి. పాకిస్థాన్‌తో మ్యాచ్‌నే ఉదాహరణగా తీసుకుంటే.. అమెరికా తరఫున సత్తాచాటిన వారిలో అత్యధికులు భారతీయులే.
‘సూపర్’ నేత్రవల్కార్
పాకిస్థాన్‌పై సూపర్ ఓవర్లో విజయం అనంతరం ప్రతి ఒక్కరూ సౌరభ్ నేత్రవల్కార్ గురించే చర్చిస్తున్నారు. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, జైదేవ్ ఉనాద్కట్ వంటి టీమిండియా ప్లేయర్లతో కలిసి 2010లో అండర్ ప్రపంచకప్ ఆడిన సౌరభ్.. ఆ తర్వాత ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డాడు. ఒరాకిల్‌లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా కొలువు చేస్తూనే.. తనకిష్టమైన క్రికెట్ ప్రాక్టీస్ కొనసాగించాడు. అంచలంచెలుగా ఎదుగుతూ జాతీయ జట్టుకు ఎంపికైన సౌరభ్.. పాకిస్థాన్‌తో సూపర్ ఓవర్లో అద్వితీయ ప్రదర్శన కనబర్చాడు. పూర్తి కోటా 4 ఓవర్లలో కేవలం 18 పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా సౌరభ్ స్వింగ్ బంతులను ఎదుర్కొనేందుకు బాబర్ సైతం తీవ్రంగా తడబడ్డాడు. ఇక మ్యాచ్ టైగా ముగియగా.. విజేతను నిర్ణయించేందుకు నిర్వహించిన సూపర్ ఓవర్లో సౌరభ్ అద్భుతమే చేశాడు. కట్టుదిట్టమైన బంతులతో క్రీడాలోకాన్ని తనవైపు తిప్పుకున్నాడు. ముంబైలో పుట్టి పెరిగిన సౌరభ్ 2010 అండర్ ప్రపంచకప్‌లో యంగ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ టోర్నీలో పాకిస్థాన్‌తో పోరులో 5 ఓవర్లు వేసిన సౌరభ్ 16 పరుగలే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.
అంతా మనవాళ్లే!
సౌరభ్ ఒక్కడే కాదు.. అమెరికా జట్టులో అగ్రభాగం భారతీయులే. పేసర్ హర్మీత్ సింగ్ ముంబైలో పుట్టి అమెరికాకు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. జగ్దీప్ సింగ్ కూడా భారత సంతతి ఆటగాడే. ఇక కోరె అండర్సన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. న్యూజిలాండ్ జాతీయ జట్టు తరఫున ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి.. విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన అండర్సన్ ఆ తర్వాత అక్కడి నుంచి అమెరికాకు వలస వచ్చి ఇక్కడ కూడా రాణిస్తున్నాడు. అన్నింటికంటే ముఖ్యంగా పాకిస్థాన్‌పై అమెరికా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన యూఎస్ఏ కెప్టెన్ మోనాంక్ పటేల్‌ది మన గుజరాతే. నితీశ్ కుమార్ కూడా భారత సంతతికి చెందిన ఆటగాడే కాగా.. మహమ్మద్ ఎహెసాన్ అలీ ఖాన్ పాకిస్థాన్‌లో పుట్టి పెరిగి.. ఆ జట్టుపైనే చక్కటి ప్రదర్శనతో వెలుగులోకి వచ్చాడు. ఇలా దండలోని వేర్వేరు పూసల్లా.. హారంలోని రకరకాల పూలలా.. ఎక్కడెక్కడి నుంచో వచ్చి అమెరికా తరఫున అదరగొట్టిన ఆటగాళ్లు.. ఇంకాస్త కష్టపడితే సూపర్ చేరడం పెద్ద కష్టం కాకపోవచ్చు!