Rajasthan Royals Riyan Parag: రియాన్ పరాగ్.. ఇప్పుడు ఐపీఎల్లో పెను సంచలనం. 2024 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ తరపున ఆడుతున్న పరాగ్ మూడు మ్యాచ్ లు కలిపి 181 పరుగులు సాధించిన పరాగ్ వరుసగా రెండు అర్థసెంచరీలు సాధించాడు. ప్రస్తుతం కోహ్లితో కలిసి ఆరెంజ్ క్యాప్ రేసులో కొనసాగుతున్నాడు.
ధనాదన్ ‘ధోని’.. చెన్నైలో జరగలేదు, విశాఖ ప్రేక్షకుల పంట పండింది పో..
కానీ ఇదే రియాన్ పరాగ్ గతేడాది కాస్త ఓవర్ యాక్షన్ ప్లేయర్‌గా కనిపించాడు. క్యాచ్ పట్టినా.. సిక్సర్ కొట్టినా.. అవతలి జట్టు ఆటగాళ్లను గేలి చేయాలన్నా ముందు వరుసలో ఉండేవాడు. తన ఓవర్ యాక్షన్‌తో అభిమానులకు కూడా విసుగు తెప్పించేవాడు. పోనీ బ్యాటింగ్ ఏమైనా బాగా చేసేవాడా అంటే అదీ లేదు. విఫలమవుతున్నా వరుసగా అవకాశాలు ఇస్తూనే వచ్చింది రాయల్స్ మేనేజ్ మెంట్.
చాలా మార్పు వచ్చింది
కట్ చేస్తే ఈ ఏడాది ఐపీఎల్ లో రియాన్ పరాగ్ కొత్తగా కనిపిస్తున్నాడు. ఓవర్ యాక్షన్ కు మారుపేరుగా నిలిచిన ఆటగాడినేనా మనం చూస్తున్నాం అన్నంతలా అతని ఆటలో మార్పు వచ్చింది. గత మూడు మ్యాచ్ ల్లో గ్రౌండ్ లో కూడా పరాగ్ ఎక్కడా అతి చేయడం కనిపించలేదు. పైగా బ్యాటింగ్ లో ఇరగదీస్తున్నాడు. వేగంగా ఆడడమే కాకుండా జట్టును గెలిపించే బాధ్యతను తన మీద వేసుకున్నాడు. కెప్టెన్ సంజూ శాంసన్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
గతేడాది ఐపీఎల్ లో రియాన్ పరాగ్( Riyan Parag) దారుణంగా విఫలమయ్యాడు. 11 మ్యాచ్ లాడి కేవలం 78 పరుగులు మాత్రమే చేశాడు. రాజస్థాన్ జట్టులో ఐదుగురు బ్యాటర్లు, ఐదుగురు బౌలర్లు, ఓ రియాన్ పరాగ్ ఉన్నారంటూ.. ఈ యువ క్రికెటర్ బ్యాటింగ్ చేయలేడు, బౌలింగ్ చేయలేడంటూ విమర్శలు కూడా గుప్పుమన్నాయి. ఓవర్ యాక్షన్ స్టార్ అనేది అదనంగా వచ్చిన బిరుదు.
ఆరేంజ్ క్యాప్ రేసులో
అయితే రియాన్ పరాగ్ ఆ తర్వాత తన ఆటతీరును పూర్తిగా మార్చుకున్నాడు. దేశవాలీ టోర్నీ అయిన దేవధర్ ట్రోఫీలో ఐదు ఇన్నింగ్స్‌ల్లో 354 పరుగులు చేసిన పరాగ్.. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 10 ఇన్నింగ్స్‌ల్లో 510 రన్స్ చేశాడు. ఈ క్రమంలో వరుసగా ఏడు హాఫ్ సెంచరీలు బాదాడు. దేశవాళీ సీజన్లో అదరగొట్టిన పరాగ్.. అదే ఫామ్‌ను ఐపీఎల్‌లోనూ కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్లో రాజస్థాన్ బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగో స్థానానికి ప్రమోట్ చేయడం కూడా పరాగ్‌కు కలిసొచ్చింది.
మూడు మ్యాచ్‌ల్లోనూ మంచి ప్రదర్శన చేసిన రియాన్ పరాగ్.. ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ రేసులోకి దూసుకొచ్చాడు. విరాట్ కోహ్లి (181, యావరేజ్ 90.50), హెన్రిచ్ క్లాసేన్ (167)లను వెనక్కి నెట్టిన రియాన్ పరాగ్ (181 – యావరేజ్ 181) ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచాడు. దీంతో ఒకప్పుడు రియాన్ పరాగ్‌ను ట్రోల్ చేసిన వారే ఇప్పుడు ప్రశంసలు గుప్పిస్తున్నారు. వయసు 22 ఏళ్లు కాబట్టి ఇదే తరహా ప్రదర్శన చేస్తే త్వరలోనే జాతీయ జట్టు తలుపు తట్టే అవకాశముంది.