Amazon Layoffs: ఆర్థిక సంక్షోభంకారణంగా కంపెనీలు తమ సిబ్బందిపై వేటు వేయడం ప్రారంభించాయి. ఈ జాబితాలో దిగ్గజ సంస్థలు కూడా ఉన్నాయి. అప్పట్లో ఉద్యోగులపై మొదలైన లేఆఫ్‌ల కత్తి ఇంకా వేలాడుతూనే ఉంది. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టామన్న సంతోషపడి, నెల కూడా కాకముందే గూగుల్, అమెజాన్, మెటా సహా పలు దిగ్గజ కంపెనీలు కొలువుల కోతకు తెగబడ్డాయి. తాజాగా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వారం వ్యవధిలో మరోసారి తమ సిబ్బందికి ఊహించని షాకిచ్చింది.
బాబోయ్.. భయపెడుతున్న కంపెనీలు
అమెజాన్ వారం రోజుల క్రితం తన పేరెంట్ కంపెనీలు ట్విచ్, ఆడిబుల్‌లో సిబ్బందిని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ చర్యలు తీసుకుని వారం తిరిగే లోపే అమెజాన్‌లో ‘బై విత్ ప్రైమ్’ ( Buy with Prime) విభాగంలో పనిచేస్తున్న 5 శాతం మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు రాయిటర్స్ తెలిపింది. కంపెనీ కార్యాచరణ అవసరాల,సంస్థాగత మార్పులు వల్ల కొద్ది శాతం మంది సిబ్బందిపై కోత విధిస్తున్నట్లు తెలిపింది.
ఈ కోత ద్వారా ప్రభావితమైన ఉద్యోగుల సంఖ్యను వెల్లడించనప్పటికీ, దాదాపు ఆ విభాగంలో పని చేస్తున్న 30 మంది సిబ్బందిపై తొలగింపు ప్రభావం పడుతుందని సమాచారం. అయితే, సెక్షన్ నుంచి తొలగిస్తున్న ఉద్యోగులకు మరొక యూనిట్ లేదా మరేదైనా కంపెనీలో ఉద్యోగం పొందడానికి సహాయం చేస్తామని సంస్థ తెలిపింది.
తొలగించిన వారికి కనీసం 50 రోజుల వేతనంతో పాటు ప్రయోజనాలను అందజేస్తామని అమెజాన్ ప్రతినిధి హామీ ఇచ్చారు. కాగా పలు కారణాల వల్ల అమెజాన్ సంస్థ గత రెండు సంవత్సరాలుగా ( 2022) కొన్ని వేల మందిపై వేటు వేసింది. ఉద్యోగులపై కోతలు విధిస్తున్న కారణంగా శ్రామిక శక్తి పరంగా కంపెనీలో తగ్గుదల ఉన్నప్పటికీ, అమెజాన్ 2023లో రికార్డు లాభాలను నమోదు చేయడం గమనార్హం.
నిండా ముంచుతున్న ఏఐ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధిలో భారీగా పెట్టుబడులు పెట్టడం ఈ కోతలకు కారణమని తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి మొదటి మూడు వారాల్లోనే దిగ్గజ టెక్ కంపెనీలు సైతం భారీ స్థాయిలో ఉద్యోగాలను తొలగించినట్లు లేఆఫ్స్.ఎఫ్‌వైఐ నివేదిక వెల్లడించింది.
గూగుల్ కూడా అదే దారిలో..
ఖర్చు తగ్గించే చర్యల్లో భాగంగా గూగుల్ తన హార్డ్‌వేర్, వాయిస్ అసిస్టెన్స్, ఇంజనీరింగ్ టీమ్‌లలో పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, కంపెనీ ప్రాధాన్యతలు, రాబోయే ముఖ్యమైన అవకాశాలలో గూగుల్ (Google) బాధ్యతాయుతంగా పెట్టుబడి పెట్టే దిశగా ముందుకు సాగుతున్నందున ఈ తొలగింపు చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
ఇలాంటి సంస్థాగత మార్పులు కంపెనీలు ప్రతి సంవత్సరం జరుగుతుంటాయి, ఈ క్రమంలో కొన్ని టీంలో పని చేసే సిబ్బందిపై కోత విధించడం సహజమని సంస్థ ప్రతినిధి తెలిపారు. భారీ మొత్తంలో ఉద్యోగులను తొలగించడం గూగుల్‌లో ఇదే తొలిసారి కావడం గమనార్హం.