న్యూ ఇయర్ రెసొల్యూషన్ అంటూ కొత్త లక్ష్యాలను నిర్ధేశించుకునే రోజు ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ ఏడాది ఆరంభంలోనే కొత్త నిర్ణయం తీసుకున్నాడు. అయితే అది ఆరంభం కాదు ముగింపు.. వన్డే క్రికెట్ ఫార్మాట్ కు వీడ్కోలు పలుకుతూ 2024 ను ప్రారంభించాడు. సొంత గడ్డ పై చివరి టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్దమవుతున్న అతను, ఊహించని విధంగా వన్డేలకు గుడ్ బై చెప్పాడు.
దాదాపు దశాబ్దన్నర కాలంగా ఆస్ట్రేలియా క్రికెట్ లో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న వార్నర్ వన్డేల నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం వెల్లడించాడు. కానీ జట్టుకు అవసరమైతే 2025 చాంపియన్స్ ట్రోఫీకి ఆడతానని తెలిపాడు. “ప్రపంచకప్ ఆడుతున్న సమయంలోనే వన్డేలనుండి రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకున్నా, భారత్ లో ప్రపంచకప్ గెలవడం తన కెరీర్లో గొప్ప ఘనత. అందుకే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నా” అయితే.. టీ20 ఇంటర్నేషనల్స్‌లో కొనసాగుతానని చెప్పాడు.
డేవిడ్ వార్నర్ కెరీర్..
వార్నర్ దక్షణాఫ్రికాతో 2009 జనవరిలో జరిగిన మ్యాచ్ తో అరంగేట్రం చేశాడు. 15 ఏళ్ళ కెరీర్లో 161 వన్డే మ్యాచ్ లు ఆడిన వార్నర్ 45.30 సగటుతో 6932 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 99 టీ20 మ్యాచ్ ల్లో 2894 పరుగులు సాధించాడు. 111 టెస్టులు ఆడిన వార్నర్ 44.58 సగటుతో 8695 పరుగులు చేశాడు. రెండు వన్డే ప్రపంచకప్ లు 2015, 2023 గెలిచిన జట్టులో వార్నర్ సభ్యుడిగా ఉన్నాడు. ఐపీఎల్లో 176 మ్యాచ్‌లు ఆడి 6397 పరుగులు సాధించాడు.
వివాదాలు..
బాల్ టాంపరింగ్ కారణంగా తనపై జీవితకాల నిషేధం పడ్డ సంగతి తెలిసిందే. అయితే 2022 లో ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాళ్ల ప్రవర్తనా నియమాలలో సవరణలు చేయడం ద్వారా వార్నర్ కు అప్పీల్ చేసుకునే అవకాశం వచ్చింది. కానీ విచారణ బహిరంగంగా జరగాలని చెప్పడంతో వార్నర్ వద్దనుకున్నాడు. “కెప్టెన్సీ అప్పీల్ విషయంలో మరోలా జరుగుంటే బాగుంటుందేమో అనిపించింది. కానీ అది మర్చిపోయి ముందుకు సాగి ఐపీఎల్లో జట్లకు కెప్టెన్సీ అవకాశాలు రావడం సంతోషంగా ఉంది” అని వార్నర్ అన్నారు.
ఇదే వార్నర్ చివరి టెస్ట్ మ్యాచ్..
పాకిస్తాన్‌తో జరగబోయే టెస్ట్ మ్యాచ్ డేవిడ్ వార్నర్‌కు చివరి టెస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్‌లో బుధవారం మొదలవుతుంది. తన హోమ్ గ్రౌండ్‌లోనే చివరి టెస్ట్ మ్యాచ్ ఆడబోతోన్నాడు వార్నర్. ఇది అతని 112వ టెస్ట్ మ్యాచ్.