Family Star Movie Review in Telugu: గీతా గోవిందం హిట్ తర్వాత విజయ్ దేవరకొండ- డైరెక్టర్ పరశురామ్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ఫ్యామిలీ స్టార్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఈ మూవీని నిర్మించారు. విజయ్ కూడా కొన్నేళ్లుగా సరైన హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. ఖుషి మూవీ బాగున్నా ఎందుకో గానీ రౌడీ హీరో రేంజ్ హిట్ ఇవ్వలేకపోయింది. దీంతో ఈ సారి ఎలాగైన బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాలని పరశురామ్‌తో జత కట్టి ఈ మూవీ చేశాడు.
ఇటీవల రిలీజైన ట్రైలర్, టీజర్ కూడా ఆడియన్స్‌కి నచ్చడంతో రౌడీ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఫ్యామిలీ స్టార్ కోసం ఎంతగానో ఎదురుచూశారు. శుక్రవారం నేడు (ఏప్రిల్ 5) ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజైంది. మరి ఫ్యామిలీ స్టార్‌తో విజయ్ ఐరన్ వంచాడా లేదా చూసేద్దాం రండి.
కథ
ఇక స్టోరీలోకి వెళ్తే… మధ్య తరగతి కుటుంబానికి చెందిన గోవర్ధన్ (విజయ్ దేవరకొండ) ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో ఆర్కిటెక్ట్ ఇంజినీర్ ఉద్యోగం చేస్తుంటాడు. మిడిల్ క్లాస్ లైఫ్ అంటే గుర్తొచ్చేవి బాధ్యతలు.. వాటన్నింటి తన భుజాల మీద మోస్తూ బతుకు చక్రాన్ని నడిపిస్తూ ఉంటాడు. అలా గోవర్దన్ లైఫ్ సాగుతుండగా .. అతని ఇంటి మీదకు అద్దెకు చేరిన ఇందు (మృణాల్ ఠాకూర్) మెల్లగా అతని జీవితంలోకి వచ్చేస్తుంది. మొదటి నుంచి ఆమెను దూరంగా ఉంచుతూ వస్తున్న గోవర్థన్ అనూహ్యంగా ఇందు ప్రేమలో పడి.. అది కాస్త వ్యక్తపరిచే సమయానికి ఊహించని షాక్ తగులుతుంది. ఆ తర్వాత అతనికి ఎదురైన సమస్యలు ఏంటి .. చివరికి తను ప్రేమించిన ఇందుని దక్కించుకున్నాడా అనేది తెలియాలంటే తెరపై మూవీ చూడాల్సిందే.
విశ్లేషణ
గతంలో విజయ్ దేవరకొండ పరశురాం కాంబినేషన్లో గీతగోవిందం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ అదే కాంబోలో మరో సినిమా అనేసరికి అంచనాలు మామూలుగా ఉండదు. అందుకే ఫ్యామిలీ స్టార్ మూవీకి విపరీతమైన హైప్ వచ్చేసింది. దీంతో థియేటర్లోకి వెళ్లే ప్రేక్షకుడు గీతాగోవిందం స్థాయి వినోదాన్ని ఊహించుకుని వెళ్తాడు. ఇక మూవీ ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్ అంతకు మించి ఈ సినిమా ఉంటుందని తెలిపారు.కానీ ఇక్కడ అది జరగలేదని అనిపిస్తుంది. ఫ్యామిలీ స్టార్ అని పేరు పెట్టినప్పుడు.. కుటుంబ కథాంశంతో ఈ సినిమా ఉండబోతోందని ఊహించుకోవడం సహజం.
ఇక ఈ జోనర్లో మూవీ అంటే ప్రేక్షకులు ఆకట్టుకునేలా ఎమోషన్స్ పండించాల్సి ఉంటుంది.. లేదంటే అది సినిమా ఫలితంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఈ మూవీలోనూ అదే జరిగింది.. ఎమోషన్స్ సరిగా పండించలేకపోయారు. ఇక కోట్లకు వారసురాలైన హీరోయిన్ ఇందు పీహెచ్డీ చేయడం కోసం పరితపించడం..అందుకోసం తను చేసే పనులు కూడా లాజిక్ మిస్ అయినట్లు అనిపిస్తుంది. అయితే ఫస్టాఫ్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో విజయ్ మృణాల్ కెమిస్ట్రీ కూడా బాగానే ఉంటుంది. చివరికి ఇంటర్వెల్ ట్విస్ట్‌తో సినిమా కాస్త ఆసక్తికరంగా మారుతుంది.
సెకండాఫ్‌లో సంథింగ్ స్పెషల్ ఉంటుందేమో అనుకున్న ప్రేక్షకుడికి నిరాశమిగులుతుందని చెప్పాలి. ఇందు పాత్ర సెకండాఫ్‌లో బొమ్మలా మారిపోతుంటుంది. కామెడీ కూడా కొన్ని చోట్ల నవ్వించలేకపోయింది. పాత్రల మధ్య జరిగే సంభాషణలు కూడా ఆడియన్స్‌కు అంతగా ఎక్కలేదనే చెప్పాలి. ఇక కల్యాణీ వచ్చా.. పాట మూవీ అయిపోయాక రోలింగ్ టైటిల్స్‌లో వస్తుంది. ఇంత మంచి పాటను మూవీలో సరిపోయే సీనుకు సంబంధించి పెట్టుకుంటే బాగుండేది.. దీని బట్టి స్క్రీన్ ప్లే ఎలా ఉందో అర్థం చేసుకోవొచ్చు.
ఎవరెలా చేశారు
నటీనటుల విషయానికి వస్తే.. గోవర్ధన్ పాత్రలో విజయ్ దేవరకొండ చూస్తే మిడిల్ క్లాస్ మ్యాన్ని చూసినట్లే అనిపిస్తుంది. అంతేకాకుండా మూవీకి మెయిన్ అసెట్‌గా విజయ్ నటన మిగిలిపోతుంది. మృణాల్ ఠాకూర్ నటన తో అందరినీ ఆకట్టుకుంటుంది. విజయ్ తో కెమిస్ట్రీ కూడా బాగానే ఉంటుంది కానీ గతంలో తన నటించిన మూవీస్‌లో హీరోలతో ఉన్న వాటితో పోల్చి చూస్తే..ఇందులో పూర్తిస్థాయిలో మ్యాజిక్ వర్కౌట్ కాలేదని అనిపిస్తుంది. బామ్మ పాత్రలో నటించిన రోహిణి ((సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు)) ఆకట్టుకుంది. జగపతిబాబు, వెన్నెల కిషోర్, ప్రభాస్ శ్రీను వంటి వాళ్ళుని ఇంకాస్త ఉపయోగించుకుంటే బాగుండేది అనిపిస్తుంది.. అయితే వాళ్లు ఉన్నంతలో పర్వాలేదు అనిపించారు. ఇక టెక్నికల్ అంశాలపై ఓ లుక్కేస్తే.. పాటలు తెరమీద చూస్తుంటే బాగానే అనిపించాయి. బీజీఎం మీద ఇంకాస్త శ్రధ్ధ పెట్టుంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్‌గా ఎలా ఉందంటే..
విజయ్, పరశురాం కాంబోలో మూవీపై ఉండే అంచనాలను అందుకోలేదనే చెప్పాలి. ముఖ్యంగా ఎమోషన్స్ వర్కవుట్ కాకపోవడం కొన్ని సీన్లు ఆడియన్స్ అంతగా కనెక్ట్ కాకపోవడం మూవీకి మైనస్‌గా మారింది. ఇక ఓవరాల్‌గా “ది ఫ్యామిలీ స్టార్” మూవీ ఫర్వాలేదనిపిస్తుంది.