Hanuman Movie: పండుగ సీజన్ వస్తే చాలు వ్యాపారులకు పండుగే. వివిధ ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటూ లాభాలు సంపాదించే పనిలో ఉంటారు. ఇక సినీ పరిశ్రమలో కూడా అంతే. ఫెస్టివల్ వస్తుంది అనగానే చిన్న సినిమాల నుంచి భారీ బడ్జెట్ ప్రాజెక్ట్లు కూడా ఈ సమయంలో క్యూ కడుతుంటాయి. అయితే ఈ సారి పండుగ సీజన్ ఓ కాంట్రవర్శీకి తెర లేపింది.
ఈ ఏడాది సంక్రాంతి సీజన్లో ఏకంగా ఐదు సినిమాలు విడుదలకు సిద్దంగా ఉండడం ప్రధాన సమస్యగా మారింది. ఈ జాబితాలో సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ సినిమా గుంటూరు కారంతో పాటు, ఈగల్, సైంధవ్, హనుమాన్, నా సామిరంగా సంక్రాంతి బరిలో నిలిచాయి. సినిమాలు రెడీగా ఉన్నప్పటికీ ప్రధానంగా వీటికి థియేటర్ల కేటాయింపు సవాలుగా మారింది.
ఆ సినిమా తప్పుకుంటే మంచిది..
ఈ సమస్య పరిష్కారం కోసం టాలీవుడ్ నిర్మాతల మండలి రంగంలోకి దిగి ఈ ఐదు సినిమాలు నిర్మాతలతో దిల్ రాజు నేతృత్వంలో సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ సంక్రాంతికి ఒకే సారి 5 సినిమాలు అంటే థియేటర్ల కేటాయింపు కష్టమవుతుందని, ఈ క్రమంలో అవకాశం ఉన్న వాళ్ళు తమ చిత్రన్ని వాయిదా వేసుకోవాలని సూచించారు.
అయితే దీంతో పాటు ముఖ్యంగా ‘హనుమాన్’ సినిమా గురించి ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. తాను ‘హనుమాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మతో కూడా మాట్లాడానని, విడుదల తేదీని మార్చాలని సూచించినట్లు.. అయితే తుది నిర్ణయాన్ని వర్మకే వదిలేశానని ఆయన వెల్లడించారు. హనుమాన్ చిత్రాన్ని వాయిదా వేసేలా కొందరు టాలీవుడ్ పెద్దలు ఒత్తిడి తీసుకొస్తున్నారని టాలీవుడ్లో టాక్.
వాయిదా కోసం ఒత్తిడి
ఇదిలా ఉండగా ‘హనుమాన్’ దర్శకుడు దీనిపై స్పందించాడు. తమ సినిమాను సంక్రాంతి రేసు నుంచి బయటకు నెట్టేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలను అంగీకరించాడు. అయితే ఇక్కడ బెదిరించారు అనే మాట వాడలేదు కానీ తన సినిమాను ఈ పోటీ నుంచి తప్పించేందుకు మాత్రం గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు ప్రశాంత్ చెప్పాడు. ఈ సీజన్ కోసం తాము ముందుగా డేట్ ప్రకటించామని.. అలాంటప్పుడు తామెందుకు తప్పుకుంటామని ప్రశ్నించాడు.అయితే హనుమాన్ పై తనకు నమ్మకముందని ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి బరిలో నుంచి తప్పుకోవడం లేదని స్పష్టం చేశాడు..
నైజాంలో హనుమాన్ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తున్న తరుణంలో.. వారి మద్దతు లభిస్తుందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంక్రాంతి రేసు నుంచి హనుమాన్ తప్పుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఏదేమైనా టాలీవుడ్లో చిన్న సినిమాపై చిన్న చూపు అనే కామెంట్ మరో సారి నెట్టింట మారుమోగుతోంది. గతంలో నిఖిల్ కార్తీకేయ 2 సినిమాకు ఇలాంటి అడ్డంకులే ఎదురై.. అప్పట్లో పెద్ద దుమారేన్నే రేపింది.