Sunil Narine: సునీల్ నరైన్.. ప్రస్తుతం ఐపీఎల్ లో ప్రత్యర్థి జట్లను తన బ్యాటింగ్ తో వణికిపోయేలా చేస్తున్నాడు. పించ్ హిట్టర్ అనే పదానికి సరైన నిర్వచనం చెబుతూ బౌలర్లపై ఎదురుదాడికి దిగుతున్నాడు. ప్రత్యర్థి జట్లు తేరుకునేలోపే చేయాల్సిన విధ్వంసం చేసి పారేస్తున్నాడు. ఎడా పెడా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ బౌలర్లకు కొరకరాని కొయ్యాగా మారిపోతున్నాడు. అయితే రెండు మూడేళ్ల పాటు ఐపీఎల్ లో బౌలర్‌గానే కొనసాగిన నరైన్.. మళ్లీ గంభీర్ మెంటార్ గా రాకతో బ్యాటింగ్ లో మరోసారి కేక పుట్టిస్తున్నాడు.
మ్యాచ్‌లు పోతున్నా మారని ఆర్సీబీ.. గెలవాలంటే వాటిపై ఫోకస్ చేయాల్సిందే!
మార్చి 29 బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ లక్ష్యం 183 పరుగులు. సాధారణంగా చిన్నస్వామి స్టేడియంలో అంత టార్గెట్ ను అందుకోవడం అంత సులువేం కాదు. విజయం తమదే అని ధీమాగా ఉన్న సమయంలో ఓపెనర్‌గా వచ్చిన సునీల్ నరైన్ నిమిషాల వ్యవధిలో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. కేవలం 22 బంతుల్లోనే 47 పరుగులు చేసి మ్యాచ్‌ను నైట్ రైడర్స్వైపు తిప్పేశాడు.
విశాఖలో ఉప్పెన
బెంగళూరుపై ఆడిన ఇన్నింగ్స్ గాలివాటం కాదని నిరూపిస్తూ విశాఖలో ఉప్పెనలా గర్జించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ లో తన విశ్వరూపాన్ని చూపించిన నరైన్ (Sunil Narine) ప్రతాపానికి బౌలర్లు చేష్టలుడిగారు. కేవలం 39 బంతుల్లోనే 85 పరుగులు చేశాడు. అతని విధ్వంసానికి తోడుగా రసెల్, అంగక్రిష్ రఘువంశీలు మెరుపు ఇన్నింగ్స్ లు ఆడడంతో సీజన్ లో కేకేఆర్ రెండో అత్యధిక స్కోరు చేసింది. అయితే నరైన్ హిట్టింగ్ చేయడం ఇది కొత్తేమి కాదు.. గతంలో చాలా సందర్భాల్లో ఎడాపెడా బౌండరీలు బాదుతూ తొందరగానే ఔటయ్యేవాడు.
కానీ ఢిల్లీతో మ్యాచ్ లో మాత్రం లాంగ్ స్టాండ్ ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్‌లో 13వ ఓవర్ వరకు క్రీజులో ఉన్న నరైన్ మరో రెండు మూడు ఓవర్ల పాటు ఆడి ఉంటే సెంచరీ అందుకోవడంతో పాటు కేకేఆర్ స్కోరు 300 పరుగులు కూడా దాటేదేమో. ఇక డీసీతో మ్యాచ్ చూశాకా నరైన్ విషయంలో అన్ని జట్లు అప్రమత్తంగా ఉంటాయనడంలో సందేహం లేదు. తర్వాతి మ్యాచ్ సీఎస్కే తో ఆడనున్న కేకేఆర్ కు నరైన్ మరోసారి అదిరిపోయే ఆరంభం ఇస్తాడని ఆశిస్తోంది.
ప్రధాన కారణం.. కేకేఆర్ మెంటార్
మరి నరైన్ హిట్టర్‌గా రెచ్చిపోవడానికి ప్రధాన కారణం ప్రస్తుతం కేకేఆర్ మెంటార్ గా ఉన్న గౌతమ్ గంభీర్. ఒక బౌలర్ గా ప్రపంచానికి పరిచయమైన సునీల్ నరైన్ లో హిట్టర్ ను వెలికితీశాడు గంభీర్. 2017లో కెప్టెన్ గా ఉన్న గంభీర్.. నరైన్ తో ఎవరు ఊహించని ప్రయోగం చేశాడు. తాను ఓపెనర్ గా తప్పుకొని.. క్రిస్ లిన్ తో కలిసి ఆ సీజన్లో నరైన్ తో ఓపెనింగ్ చేయించాడు. ఇది సత్ఫలితాలనే ఇచ్చింది. తన వికెట్ కు అంతగా ప్రాధాన్యం లేకపోవడంతో నరైన్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ కొన్ని మ్యాచ్ ల్లో జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చేవాడు. ఆ సీజన్ లో ఒక అర్థసెంచరీ సహా 224 పరుగులు చేశాడు.
అయితే గంభీర్ తర్వాతి సీజన్ లో ఢిల్లీకి వెళ్లిపోవడంతో నరైన్ మరోసారి లోయర్ ఆర్డర్ కు వెళ్లిపోయాడు. మళ్లీ నాలుగు సీజన్ల పాటు కేవలం బౌలర్‌గానే కొనసాగాడు. అయితే గతంలో జట్టును నడిపించిన గంభీర్ మరోసారి కేకేఆర్‌కు మెంటార్‌గా రావడంతో తన దృష్టి నరైన్ మీద పడింది. 2017లో చేసిన ప్రయోగాన్ని గంభీర్ మరోసారి తెరమీదకు తెచ్చాడు. ఒకప్పుడు కెప్టెన్ గా చేసిన ప్రయోగాన్ని ఇప్పుడు మెంటార్ గా రిపీట్ చేశాడు. నరైన్ ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది. స్పిన్ లో ఒకప్పటి బలం కనిపించినప్పటికి బ్యాటర్ గా మాత్రం చెలరేగిపోతున్నాడు నరైన్. మరి ఈ సీజన్ అంతా నరైన్ మెరుపులు ఇలాగే కొనసాగుతాయేమో చూడాలి.
ఆ దేశ బోర్డు మాత్రం ఉపయోగించుకోదు
వెస్టిండీస్ క్రికెటర్లలో ఎంత ప్రతిభ ఉన్నా.. ఆ దేశ బోర్డు మాత్రం సరిగా ఉపయోగించుకోదు. గేల్, పొలార్డ్, బ్రావో, రసెల్, నరైన్.. ఇలా ఎందరో క్రికెటర్ల సేవలను జట్టు పూర్తి స్థాయిలో వాడుకోలేదు. కాంట్రాక్టులు, జీతాల విషయంలో బోర్డు తమ ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించడంతో చాలా ఏళ్లుగా విండీస్ క్రికెటర్ల ఫ్రాంచైజీ క్రికెట్ లో ప్రాధాన్యం ఇస్తున్నారు. దేశానికి ఆడడం తగ్గించేశారు. నరైన్ లాంటి మిస్టరీ స్పిన్నర్, విధ్వంసకర బ్యాటర్ టి20ల్లో ఏ జట్టుకైనా ఎంతో విలువ చేకూరుస్తాడు. కానీ అతను 2019 తర్వాత వెస్టిండీస్‌కు ఆడనే లేదు. అయితే ఈ ఐపీఎల్లో నరైన్ ప్రదర్శన చూస్తున్న కరీబియన్ అభిమానులకు జూన్ లో జరిగే టి20 ప్రపంచకప్ లో విండీస్ తరపున ఇలాగే మెరుపులు మెరిపిస్తే చూడాలని ఆశ. మరి విండీస్ బోర్డు నరైన్ తో మాట్లాడి జట్టులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందా అనేది చూడాలి.