చలికాలం అంటేనె జలుబుకాలంలా అనిపిస్థుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా ఈ చలికాలంలో అందర్నీ పలకరించే చుట్టం జలుబు. దాదాపు ప్రతీ ఇంటా ఇదే కథ. ఇది మరీ పెద్ద అనారోగ్యము కాదు అలాగని ఇబ్బందులు పెట్టకుండాను ఉండదు. ఒక్కరికి వచ్చిందంటే చాలు ఇంట్లో మిగతా వారందరికీ కూడా వ్యాపిస్తుంది. అయితే చాలా మంది డాక్టర్ కన్సల్టేషన్లు, మందుల కొనుగోళ్లు చేస్తుంటారు. మరైతే మందులతో పాటు, వంటింటి చిట్కాలు పాటి౦చడ౦ కూడా ఫలిస్తుంది. కాకపోతే కాస్త నెమ్మదిగా వారానికో లేదా పది రోజులకో తగ్గుతుంది.
పసుపు నీళ్లు, మిరియాలు-ధనియాల కషాయం, దగ్గు మ౦దు, జండూబామ్, ఆవిరి పట్టడం, యాంటీబయోటిక్స్, ఇంజక్షన్స్.. వీటిలో ఏది పనిచేస్తుంది? పరిష్కారం తెలియాలంటే ముందు సమస్యకు మూలమేమిటో తెలుసుకునే ప్రయత్న౦ చేద్దా౦. సాదారణ౦గా జలుబు వైరల్ ఇన్ఫెక్షన్ ద్వార వ్యాపిస్తు౦ది. ఫలానా అని చెప్పలేని వందల వైరస్లలో అదొకటి. ముఖ్యంగా రైనోవైరస్ అయి ఉంటుంది.
ఇతర ఇన్ఫెక్టెడ్ వ్యక్తుల వల్ల గానీ, గాలిలోంచి గానీ, వైరస్ అంటుకున్న వస్తువుల నుంచిగానీ ఇది మన శరీరం లోకి ముక్కు, నోరు లేదా కళ్ళ ద్వారా ప్రవేశిస్తుంది. అక్కడి చర్మపు పొరల్లో ఇంకా అభివృద్ధి చెంది ఇతర అవయవాలకు కూడా ఈ వైరస్ వ్యాపిస్తుంది. రైనోవైరస్ ఇన్ఫెక్షన్ ముక్కు, గొంతు, తల భాగాలకు పరిమితమై, సాధారణ జలుబు, దగ్గు, తలనొప్పి, ఒళ్లు నొప్పులకు పరిమితం అవుతుంది.
ఇది సాధారణ జలుబు కాబట్టి, అందులోనూ వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి యాంటిబయోటిక్స్ వాడటం మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మొదటి మూడు-నాలుగు రోజులు ముక్కు వెంబడి నీళ్లు కారటం, ముక్కు పూడుకుపోవడం, వాసన తెలియక పోవడం, గొంతు పొడి బారడం, దగ్గు, జ్వరం వచ్చినట్లుండడం సహజం. తరచూ వేడి నీళ్లు తాగడం, రెండు పూటలా నోరు, ముక్కు, గొంతు శుభ్రపరుచుకోవడం (salt water gargling) వల్ల దగ్గు, ముక్కు కారడం నుండి ఉపశమనం ఉంటుంది. వేడినీళ్ల ఆవిరి పెట్టుకోవడం, ఏదైనా బామ్ రాసుకోవడం కూడా ప్రయోజనకరమే. అంతకు మించి రకరకాల దగ్గు మందులు వాడడం వలన ప్రయోజనం ఏమీ లేదు.
తలనొప్పి, శరీరం వెచ్చబడటం, ఒళ్లు నొప్పులు లాంటి బాధలకు బరువుకు తగ్గంత పారాసిటమాల్ వేసుకోవచ్చు. ఆ మాటకొస్తే అవసరమైనప్పుడు కొన్ని యాంటీబయోటిక్స్ డాక్టర్ల సలహా మేరకు భేషుగ్గా వాడొచ్చు. కొన్ని సార్లు ఈ సాధారణ జలుబు ఉన్న స్థితిలో, కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వచ్చి చేరతాయి. దీన్ని మనం ఎలా గుర్తించాలంటే. ఉన్నట్లుండి జ్వరం తీవ్రత పెరగడం, నాసికాస్రావాలు చిక్కగా, పసుపుపచ్చగా మారడం, గొంతులో గళ్ళ పేరుకుపోవడం లాంటివి కనిపిస్తాయి. ఇలాంటప్పుడు రోగలక్షణ ఆధారిత వైద్యానికి మించి మందులు అవసరమౌతాయి తక్షణం డాక్టర్ దగ్గరికి వెళ్లండి. మరీ చిన్న పిల్లల్లో మాత్రమే అరుదుగా న్యుమోనియా, బ్రోన్కియోలిటిస్ లాంటి సమస్యలు రావచ్చు కాబట్టి వెంటనే పిల్లల డాక్టర్ని సంప్రదించడం మంచిది.